Shivaratri: పరమశివుడి అద్భుత విశ్వం... మహాశివ రాత్రి సందర్భంగా స్పెషల్ స్టోరీ 1 y ago
ఆయన కైలాసవాసుడు..
ఆయన భోళా శంకరుడు..
ఆయన పరమేశ్వరుడు..
ఆయన ఆత్మ లింగేశ్వరుడు..
ఆయన మంజునాథుడు..
మహాశివ రాత్రి సందర్భంగా 8K న్యూస్ స్పెషల్ స్టోరీ
కోటి లింగేశ్వరుడు, సాంబయ్య, శ్రీశైల మల్లిఖార్జునుడు, కాశి విశ్వనాథుడు ఇలా ఎన్నో పేర్లు. కానీ ఆయన రూపం ఒకటే.. నామం ఒకటే.. ఆయనే పరమ శివుడు. హిందువులు ఆచరించే పండుగల్లో శివరాత్రి కూడా ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా శ్రీశైలం, మహానంది, కాశీ లాంటి పుణ్య క్షేత్రాల్లో అంగరంగ వైభవంగా ఈ పండుగను చేస్తారు. ఈ పుణ్యక్షేత్రాల్లో అనేక సంవత్సరాలుగా పూజలందుకుంటున్నాడు ఆత్మలింగేశ్వరుడు.
శివరాత్రిని పురస్కరించుకుని కొన్ని ప్రధాన ఆలయాల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తుల వేల సంఖ్యలో తరలి వస్తారు. వీధుల్లో ఆ పరమేశ్వరుడిని ఊరేగిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో శివుడిని పల్లకిపై ఊరేగిస్తారు. ఆ పల్లకిని మోసేందుకు భక్తులు ఎగబడుతుంటారు.
దేశ వ్యాప్తంగా అనేక మంది శివ భక్తులు ఉన్నారు. హిమాలయాల్లో ఉండే రుషులు, సాదువులు, అఘోరాలు సైతం నిత్యం ఆ పరమేశ్వరుడిని కొలుస్తుంటారు. సాక్ష్యాత్తు ఆ గంగమ్మ తల్లినే శిరస్సుపై పెట్టుకున్న శివుడి అనుగ్రహం కోసం అనేక సంవత్సరాలుగా దీక్షలు చేస్తుంటారు. ఆయన కోరిన కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మకం. అలా కోరికలు తీరిన ఎంతో మంది శివ మాలను ధరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. కొన్ని రోజుల తరువాత ఆ దీక్షను విరమిస్తారు.
మహాశివ రాత్రి రోజు భక్తులు ఉదయాన్నే లేచి దగ్గరలోని నదులకు వెళ్లి స్నానాలు ఆచరిస్తుంటారు. ఇలా చేస్తే పుణ్యం లభిస్తుందని వారి నమ్మకం. స్నానాలు ఆచరించిన అనంతరం శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ శివుడికి క్షీరాభిషేకాలు, జలాభిషేకాలు చేస్తారు. మహాశివ రాత్రి రోజు శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. హర హర శంభో శంకర అనే నామస్మరణతో ఆలయాలు మారుమోగుతాయి. కొందరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసంతో ఉండి అదే రోజు రాత్రి జాగారం చేస్తారు.